- సెన్సెక్స్ 897 పాయింట్లు జంప్ .. 6% వరకు పడ్డ ఆసియా మార్కెట్లు
- ఈ నెల నిఫ్టీ 12శాతం జూమ్
- రెండు రోజుల్లో రూ.17 వేల కోట్ల షేర్లు కొన్న ఎఫ్ఐఐలు
- 93 దిగువకు వచ్చిన రూపాయి
ముంబై: గ్లోబల్ మార్కెట్లు కుదేలైనా, మన మార్కెట్ మాత్రం దూసుకెళ్లింది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు శుక్రవారం ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 897.96 పాయింట్లు (1.08శాతం) లాభపడి 83,919.71 వద్ద స్థిరపడగా, ఇంట్రాడేలో 84,037.96 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 286.30 పాయింట్లు (1.12శాతం) ఎగబాకి 25,800.60 వద్ద ముగిసింది. ఒక్క నవంబర్ నెలలోనే సెన్సెక్స్ 9,460 పాయింట్లు (12.7శాతం), నిఫ్టీ 2,747 పాయింట్లు (11.91శాతం) లాభపడడం విశేషం.
రూ.10 వేల కోట్ల పెట్టుబడులు
ఎఫ్ఐఐలు గురువారం రూ. 7,411.41 కోట్ల విలువైన షేర్లను కొనగా, శుక్రవారం మరో రూ.10,300 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వీరి నుంచి సపోర్ట్ దొరకడంతో మార్కెట్ దూసుకెళ్లింది. బ్యాంకింగ్ సూచీలు శుక్రవారం ఆల్-టైమ్ గరిష్ఠాలకు చేరాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3శాతం పైగా లాభపడగా, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 2-–3శాతం రాణించాయి. టైటాన్, టాటా స్టీల్, ఎన్టీపీసీ నష్టపోయాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.89శాతం తగ్గి బ్యారెల్‌కు 90.24 డాలర్లకు దిగొచ్చింది.
రూపాయి దూకుడు
విదేశీ పెట్టుబడులు వస్తుండడం, దేశీయ స్టాక్ మార్కెట్ల ర్యాలీ, ముడి చమురు ధరలు తగ్గడంతో రూపాయి వరుసగా ఐదో రోజూ భారీగా బలపడింది. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 70 పైసలు లాభపడి 92.62 వద్ద స్థిరపడింది. ఏడు నెలల తర్వాత మన కరెన్సీ 93 మార్కు కంటే బలమైన స్థాయిలో (92.67 వద్ద) ముగియడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో రూపాయి డాలర్‌తో పోలిస్తే రూ. 92.40 నుంచి రూ. 93.00 మధ్య సానుకూలంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని ఫారెక్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్ల క్రాష్
అమెరికా, ఆసియా, యూరోపియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పడ్డాయి. ఏఐ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలతో వరుసగా ఏడో రోజూ నష్టాలను నమోదు చేశాయి. తైవాన్ తైయక్స్ 6.2శాతం, దక్షిణ కొరియా కొస్పీ 5.2శాతం, జపాన్ నిక్కీ 225 5.1శాతం, హాంకాంగ్ హంగ్ సెంగ్ 1.9 శాతం తగ్గింది. ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 200 1.6శాతం , చైనా షాంఘై కాంపోజిట్ 1.2శాతం పడ్డాయి. అమెరికా ఎస్ అండ్ పీ500 ఇండెక్స్ 2శాతం నష్టపోగా, యూరోపియన్ మార్కెట్లు కూడా 3 శాతం వరకు క్రాష్ అయ్యాయి.
పతనానికి కారణాలివే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, ఆ స్థాయిలో వెంటనే లాభాలు వస్తాయా లేదా అనే సందేహాలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. గురువారం ఆంత్రోపిక్ ఐపీఓ 111.50 డాలర్ల గరిష్ఠానికి వెళ్లి ఆ తర్వాత 97 డాలర్లకు దిగిరావడంతో, ఏఐ స్టాక్స్ విలువలు అవసరానికి మించి పెరిగాయనే ఆందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో సాఫ్ట్‌బ్యాంక్, శాంసంగ్, టెన్సెంట్, అడ్వాన్టెస్ట్ వంటి టెక్, చిప్ షేర్లు కుప్పకూలాయి.
అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి చైనాకు ఏఐ చిప్స్ చేరాయన్న ఆరోపణలపై ఎన్విడియాపై కాలిఫోర్నియాలో దర్యాప్తు మొదలవడం, మరోవైపు ఏఎండీపై షార్ట్ సెల్లర్ రిపోర్డ్ రావడంతో సెమీకండక్టర్ రంగంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీనివల్ల టెక్ కంపెనీల రుణ ఖర్చులు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకుని సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు
